హైదరాబాద్‌లో కల్తీ మద్యం ముఠా అరెస్ట్

హైదరాబాద్, డిసెంబర్ 8 ( వార్త సంధ్య ) : హైదరాబాదులో ఖరీదైన బ్రాండెడ్ మద్యం సీసాల్లో నుంచి అసలు మద్యాన్ని తీసేసి, దాని స్థానంలో కల్తీ మద్యం నింపి సగం ధరకే విక్రయిస్తున్న ఓ ముఠాను ఎక్సైజ్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ. 8 లక్షల విలువైన కల్తీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న సరుకులో 139 నింపిన మద్యం బాటిళ్లు, 136 ఖాళీ సీసాలు, ఒక స్కూటీ ఉన్నాయి. గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలోని ఇందిరానగర్ మార్గంలో ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, స్కూటీపై వెళ్తున్న దేశిని ప్రకాశ్ గౌడ్, గద్వాల భరత్‌లను అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద 15 ఖరీదైన బ్రాండెడ్ మద్యం బాటిళ్లు లభించగా, పరిశీలనలో అవి కల్తీ మద్యం అని నిర్ధారణైంది.విచారణలో ప్రకాశ్ గౌడ్ తమ్ముడు అరవింద్ ఇంట్లో ఈ అక్రమ దందా సాగుతున్నట్లు వెల్లడైంది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఒడిశాకు చెందిన బుచ్చిదేవ్ మహంతి ఈ కల్తీ మద్యం తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించాడు. వెంటనే పోలీసులు మహంతి ఇంటిపై దాడి చేసి 54 మద్యం బాటిళ్లు, మరో నిందితుడు విక్రమ్ వద్ద నుంచి 24 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.రూ.20 వేల విలువ చేసే ఖరీదైన మద్యం బాటిల్‌ను కల్తీ చేసి రూ.10 వేలకే విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. ఈ అక్రమ వ్యాపారంపై సమాచారం అందుకుని దాడులు నిర్వహించిన డీటీఎఫ్ బృందాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణ ప్రియ, డిప్యూటీ కమిషనర్ దశరథ్ అభినందించారు. నిందితులు, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.
