జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం
ఎల్బీనగర్ ప్రతినిధి, ఫిబ్రవరి 14 ( వార్త సంధ్య): ఎల్.బి.నగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారం డివిజన్ పరిధిలో ఉన్న వివేకానంద బస్ స్టాప్ వద్ద జిహెచ్ఎంసి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఈ ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది డ్రైనేజీ లోని చెత్తను మిషనరీ ద్వారా బయటకు తీసి, అదే ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.డ్రైనేజీ నుంచి తీసిన మురుగుపై బ్లీచింగ్ చేయకపోవడంతో పరిసర ప్రాంతమంతా భరించలేని దుర్వాసనతో నిండిపోయింది. ముఖ్యంగా రోజూ వందలాది మంది ప్రయాణించే వివేకానంద బస్ స్టాప్ వద్ద ఈ పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.మ్యాన్ హోల్ లేదా డ్రైనేజీ క్లీన్ చేసిన వెంటనే చెత్తను తొలగించి శానిటేషన్ చర్యలు చేపట్టాల్సి ఉండగా, అలా చేయకపోవడం వల్ల ప్రజారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమలు, సంక్రమణ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.ఇలాంటి నిర్లక్ష్య చర్యలు సిబ్బందికి పరిపాటిగా మారాయని, సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి కొనసాగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వివేకానంద బస్ స్టాప్ పరిసరాలను తక్షణమే శుభ్రం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
