యాదాద్రి భువనగిరి జిల్లా, జనవరి 3 (వార్త సంధ్య): యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం సదర్ శాపురం గ్రామానికి చెందిన యువ రైతు తుంగపాటి యాకరాజు (35) దుర్ఘటనలో మృతి చెందాడు. స్వగ్రామ పరిధిలోని తన వ్యవసాయ భూమిలో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ కింద పడిన యాకరాజుకు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటనతో సదర్ శాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
