కొత్తగూడెం, జనవరి 3 (వార్త సంధ్య):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ శివార్లలో కొనసాగుతున్న కోడిపందాల స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన పోలీసులు 09 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఈ దాడిలో నిందితుల వద్ద నుంచి రూ.17,000 నగదు, 08 సెల్ ఫోన్లు, 08 ద్విచక్ర వాహనాలు, పందాలకు ఉపయోగించిన 07 కోళ్లతో పాటు 12 కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ తెలిపారు.పట్టుబడిన నిందితులను తదుపరి చర్యల నిమిత్తం బూర్గంపాడు పోలీసులకు అప్పగించి, వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా, పేకాట, కోడిపందాలు, బెట్టింగులు వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉన్న పౌరులు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని టాస్క్ ఫోర్స్ పోలీసులు కోరారు
