లంచం తీసుకుంటూ ఫారెస్ట్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
కొత్తగూడెం, జనవరి 3 (వార్త సంధ్య):కొత్తగూడెంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడి నిర్వహించి ఫారెస్ట్ శాఖకు చెందిన ఇద్దరు అధికారులను లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీ ఎఫ్ డి సి (TFDC)కి చెందిన ప్లాంటేషన్ మేనేజర్ (ఫారెస్ట్ రేంజ్ అధికారి) తాడి రాజేందర్, డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిలను ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు.జామయిల్ కటింగ్‌కు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ వద్ద నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. 32 వేల టన్నుల జామయిల్ కటింగ్‌కు ప్రభుత్వం టన్నుకు రూ.750 చెల్లిస్తుండగా, అధికారులు టన్నుకు రూ.150 లంచం డిమాండ్ చేశారు. అనంతరం రూ.90కి బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం.మొదటి యూనిట్లో 3,900 టన్నుల కటింగ్‌కు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి రూ.3 లక్షల 51 వేల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
