సుకుమా కిష్టారం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ – 12 మంది మృతి
హైదరాబాద్ / సుకుమా :ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 20 మంది కీలక మావోయిస్టులు లొంగిపోనున్నారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (GLA) చీఫ్ బర్సే దేవాతో పాటు కంకనాల రాజిరెడ్డి, రేమ్ సహా మరో 20 మంది పోలీసులకు లొంగిపోనున్నట్లు సమాచారం.లొంగుబాటులో భాగంగా 48 మౌంటెడ్ LMG ఆయుధాలు మరియు రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన వద్ద ఉన్న రూ.20 లక్షలను బర్సే దేవా స్వయంగా తెలంగాణ SIBకి అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. కగార్ ఆపరేషన్ అనంతరం ఇది అతిపెద్ద ఆయుధ లొంగుబాటుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విజయానికి గాను తెలంగాణ SIB బృందాన్ని హోంశాఖ ప్రశంసించింది. డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో ఇది అత్యంత కీలక లొంగుబాటుగా అభివర్ణిస్తున్నారు.ఇదిలా ఉండగా, ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా కిష్టారం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని సమాచారం.ఎన్కౌంటర్ ప్రాంతంలో నుంచి ఒక ఏకే–47, ఇన్సాస్ రైఫిల్‌తో పాటు ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కిరణ్ చౌహాన్ ధ్రువీకరించారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ కమాండర్ మంగుడు, ఏరియా కమిటీ సభ్యుడు హితేష్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.గతంలో కుంట ఏరియాలో ఏఎస్పీ ఆకాశ్ రావు గిరిపుంజే హత్యకు సంబంధించి మంగుడు, హితేష్ కీలక సూత్రధారులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్‌ను ఏఎస్పీ ఆకాశ్ రావు గిరిపుంజే హత్యకు ప్రతీకార చర్యగా సుకుమా పోలీసులు పేర్కొంటున్నారు.గత నవంబర్‌లో కూడా ఇదే కుంట ఏరియాకు చెందిన ముగ్గురు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే.
