హైదరాబాద్, జనవరి 01 (వార్త సంధ్య):
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రూపొందించిన 2026 సంవత్సరం మీడియా డైరీని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం హైదరాబాద్‌లోని లోక్ భవన్ (రాజ్ భవన్) లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య ఫెడరేషన్ కార్యకలాపాలు, మీడియా డైరీ ప్రత్యేకతలను గవర్నర్‌కు వివరించారు. మీడియా డైరీని పరిశీలించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, సమగ్ర సమాచారంతో రూపొందించిన ఈ మీడియా డైరీ ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. మీడియా డైరీని రూపొందించిన టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను ఆయన అభినందించారు.
అంతకుముందు కార్యక్రమంలో మామిడి సోమయ్యతో పాటు ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్లు పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, బండి విజయ్ కుమార్, తన్నీరు శ్రీనివాస్, కుడితాడు బాపురావు, అలాగే నాయకులు పద్మనాభరావు, జె. ఉదయభాస్కర్ రెడ్డి, గోపాల్ తదితరులు గవర్నర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంకలు టీడబ్ల్యూజేఎఫ్ మీడియా డైరీ–2026ను వేర్వేరుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రికి, స్పెషల్ కమిషనర్‌కు పూల బొకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
