ఉప సర్పంచ్ చెక్ పవర్ మెమోపై గందరగోళం – సవరణతో కొత్త ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబర్ 23 (వార్త సంధ్య ) :పంచాయతీ రాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఉప సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేస్తూ తొలుత విడుదల చేసిన మెమో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు, గందరగోళానికి దారి తీసింది. అధికారుల తప్పుడు నిర్ణయం కారణంగా గ్రామ పంచాయతీల్లో పాలనా వ్యవస్థపై అనిశ్చితి నెలకొనగా, విషయం తీవ్రతను గ్రహించిన శాఖ ఉన్నతాధికారులు క్షణాల్లోనే వెనక్కి తగ్గి సవరణ మెమోను జారీ చేయడం గమనార్హం.పంచాయతీ రాజ్ శాఖ నుంచి విడుదలైన తొలి మెమోలో ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొనడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ ఉండటం అనేది పారదర్శకతకు, బాధ్యతకు కీలకమైన అంశమని పలువురు అభిప్రాయపడ్డారు. అలాంటి కీలక అధికారాన్ని ఒక్కసారిగా రద్దు చేయడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తాయి.ఈ మెమోపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎలాంటి చర్చ లేకుండా, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నించారు. కొందరు ఉప సర్పంచ్‌లు అయితే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యగా అభివర్ణించారు.అయితే, వివాదం ముదిరిన వెంటనే పంచాయతీ రాజ్ శాఖ స్పందించింది. ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంశం అధికారుల తప్పిదం వల్ల అనుకోకుండా మెమోలో చోటు చేసుకుందని శాఖ స్పష్టీకరణ ఇచ్చింది. సంబంధిత ఫైల్ నోటింగ్, డ్రాఫ్టింగ్ లోపాల కారణంగానే ఈ పొరపాటు జరిగిందని అధికారులు తెలిపారు. ఇది ప్రభుత్వ విధానం కాదని, ఉద్దేశపూర్వక నిర్ణయం కూడా కాదని స్పష్టం చేశారు.విషయం తీవ్రంగా మారడంతో అధికారులు క్షణాల్లోనే తప్పును సరిదిద్దుకునేందుకు ఆపసోపాలు పడ్డారు. పై స్థాయి నుంచి ఆదేశాలు అందిన వెంటనే మొదట విడుదల చేసిన మెమోను ఉపసంహరించుకుంటూ సవరణ మెమోను జారీ చేశారు. తాజా మెమోలో ఉప సర్పంచ్ల చెక్ పవర్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టంగా పేర్కొన్నారు.ఈ పరిణామంపై ఉప సర్పంచ్‌లు కొంత ఊరట వ్యక్తం చేసినప్పటికీ, ఇలాంటి నిర్లక్ష్యంతో కూడిన నిర్ణయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో డ్రాఫ్టింగ్, ఆమోద ప్రక్రియ మరింత కట్టుదిట్టంగా ఉండాలని, ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశాల్లో అత్యంత జాగ్రత్త అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి, పంచాయతీ రాజ్ శాఖలో చోటు చేసుకున్న ఈ గందరగోళం ప్రభుత్వ పరిపాలనలో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టింది. ఒక చిన్న నిర్లక్ష్యం ఎలా పెద్ద వివాదానికి దారి తీస్తుందో ఈ ఘటన స్పష్టంగా చూపించింది.
