28 నుంచి నామినేషన్ల స్వీకరణ – ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్
హైదరాబాద్, జనవరి 27 (వార్త సంధ్య):తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ నెల జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుండగా, జనవరి 30 వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరుగనుంది.ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న కౌంటింగ్ నిర్వహించనుండగా, అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు.ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థులకు బీ-ఫారం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆశావాహులు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.ఈ ఎన్నికల్లో మొత్తం 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు హోరాహోరీగా, పకడ్బందీగా సాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
