హైదరాబాద్, వార్త సంధ్య : రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేతకు సంబంధించిన కేసులో ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ (ఆరెంజ్ ట్రావెల్స్) ఎండీ సునీల్ కుమార్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) అధికారులు అరెస్ట్ చేశారు.బస్సు టికెట్ల విక్రయాల ద్వారా ప్రయాణికుల నుంచి జీఎస్టీ రూపంలో సుమారు రూ.28 కోట్ల వరకు వసూలు చేసి, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్న వ్యాపార సంస్థలపై డీజీజీఐ చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో పోటీ చేసిన సునీల్ కుమార్‌పై నమోదైన ఈ కేసు రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తూ, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు.
