హైదరాబాద్, జనవరి 4 ( వార్త సంధ్య ): తెలంగాణలో అనుకున్నదానికంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 125 పురపాలక సంఘాలకు ఈ నెల 11వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని పురపాలక శాఖ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. తొలుత సంక్రాంతి పండుగ అనంతరం షెడ్యూల్ విడుదలై, ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు పూర్తవుతాయని ప్రచారం జరిగినప్పటికీ, తాజా పరిణామాలతో జనవరి 11కే ఎన్నికల ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లపై సమర్పించే నివేదిక ఆధారంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముందని సమాచారం. షెడ్యూల్ 11న విడుదలైతే, జనవరి 25వ తేదీ నాటికే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొనగా, ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి.
